India
oi-Lingareddy Gajjala
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ మార్పు ఎదురుకాబోతోంది. టోల్ ప్లాజాల వద్ద ఇకపై చిల్లర కష్టాలకు, పొడవైన క్యూలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,150కి పైగా టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1, 2026 నుంచి నగదు (Cash) లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ పేమెంట్లతో పాటు కొంతవరకు నగదును కూడా అనుమతిస్తున్నారు. అయితే, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం టోల్ రుసుము కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. టోల్ కౌంటర్ల వద్ద నగదును స్వీకరించే విధానానికి స్వస్తి పలకడం ద్వారా టోల్ వసూళ్లలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Toll Plazas: ఫీజుల వ్యత్యాసం: ఏ పేమెంట్‌కు ఎంత?
ఒకవేళ మీ వద్ద ఫాస్టాగ్ లేకపోయినా లేదా అది సాంకేతిక కారణాల వల్ల పనిచేయకపోయినా, మీరు ఎంచుకునే డిజిటల్ విధానాన్ని బట్టి ఫీజు మారుతుంది. ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు సాధారణ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఫాస్టాగ్ లేని పక్షంలో యూపీఐ (UPI) ఆప్షన్ ఎంచుకుంటే, సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు (25% అదనంగా) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫాస్టాగ్ లేకుండా నగదు ఇస్తే రెండింతల ఫీజు వసూలు చేస్తున్నారు, కానీ ఏప్రిల్ 1 తర్వాత నగదును అసలు స్వీకరించబోరు.
డిజిటలైజేషన్ వెనుక అసలు ఉద్దేశం
టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం మరియు ఇంధన వృథాను అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. గణాంకాల ప్రకారం, ఇప్పటికే 98 శాతం టోల్ వసూళ్లు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. మిగిలిన 2 శాతాన్ని కూడా డిజిటల్ పరిధిలోకి తెస్తే, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.
భవిష్యత్తు లక్ష్యాలు – పారదర్శకత
పూర్తి డిజిటల్ లావాదేవీల వల్ల టోల్ వసూళ్లలో అవకతవకలకు తావుండదు. ప్రతి పైసా డిజిటల్ రికార్డుల్లో ఉంటుంది కాబట్టి అకౌంటింగ్ చాలా సులభమవుతుంది. రాబోయే రోజుల్లో ‘బారియర్-లెస్’ (అడ్డంకులు లేని) టోలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా ఇదొక కీలక అడుగు. అంటే వాహనాలు వేగంగా వెళ్తున్నా, సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్ గా ఫీజు కట్ అయ్యే సాంకేతికతను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.


