Andhra Pradesh
oi-Sai Chaitanya
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. భక్తులు శ్రీవారి ముక్కులు చెల్లించేందుకు కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. ఇందు కోసం భక్తులకు కొత్తగా ముడుపు పత్రాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పత్రాన్ని భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి తమ మొక్కును చెల్లించుకునే విధంగా కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఈ నెల 28న జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి.. అందరి ఆమోదం తో తుది నిర్ణయం తీసుకోనుంది.
తిరుమల శ్రీవారి ముక్కులు.. కానుకలు చెల్లించేందుకు టీటీడీ కొత్త విధానం పైన కసరత్తు చేస్తోంది. ఇందు కోసం శ్రీవారి ముడుపు పత్రాలు ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. శ్రీవారిని ఏటా దాదాపు 2.5కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పించడమనే సంప్రదాయం వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. టీటీడీ బడ్జెట్‌లోనే ప్రధాన ఆదాయ వనరు కూడా హుండీనే. 2025లో హుండీ ఆదాయం రూ.1,383 కోట్లు వచ్చింది. ఇటీవల కాలంలో నగదు రహిత లావాదేవీలకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు . దాదాపు ప్రతి ఒక్కరూ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ‘శ్రీవారి ముడుపు పత్రం’ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతితో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
బోర్డు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం
ఈ కౌంటర్లు తిరుమలలో దర్శనం, వసతి పొందే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీటిద్వారా భక్తులు రూ.100 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించి ముడుపు పత్రాలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. భక్తులు ఆ పత్రాలను ఆలయంలోని హుండీలో సమర్పించవచ్చు. వాస్తవానికి ముడుపు పత్రాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే స్వామివారి ఖాతాలకు నగదు జమ అయిపోతుంది. అయితే హుండీలో మొక్కులు చెల్లించాలన్న భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఈ పత్రాన్ని సమర్పించే విధానాన్ని అమలుచేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ నెల 28న తిరుమలలో జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో భక్తుల నుంచి ఈ విధానం పైన ఫీడ్ బ్యాక్ తీసుకున్న తరువాతనే అమల్లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


