International
oi-Lingareddy Gajjala
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు, ముఖ్యంగా తరచుగా ప్రయాణాలు చేసే ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలకు ఇది ఒక రకమైన ‘షాక్’ ఇచ్చే వార్తే. అమెరికా విమానాశ్రయాల్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నిమిషాల్లో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకునే ‘గ్లోబల్ ఎంట్రీ’ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
అమెరికా ప్రభుత్వంలో నెలకొన్న పాక్షిక షట్‌డౌన్ కారణంగా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఇమ్మిగ్రేషన్ విధానాలపై నెలకొన్న రాజకీయ పోరు వల్ల నిధులు నిలిచిపోవడంతో, ఈ నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం పాక్షిక స్తంభనలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎంట్రీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
గ్లోబల్ ఎంట్రీ అంటే ఏంటి?
సాధారణంగా విదేశాల నుంచి అమెరికా చేరుకున్న ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీల కోసం 30 నుంచి 90 నిమిషాల పాటు పొడవైన క్యూలలో వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో చాలా మంది ముందుగానే అనుమతి పొంది ‘గ్లోబల్ ఎంట్రీ’ సేవలను వినియోగించుకుంటారు. దీనివల్ల విమానాశ్రయాల్లోని ప్రత్యేక కియోస్కుల ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని బయటకు వచ్చే వీలుంటుంది. ఇప్పుడు ఈ సేవలు నిలిచిపోవడంతో, గ్లోబల్ ఎంట్రీ కార్డు ఉన్న వారు కూడా సామాన్య ప్రయాణికుల్లాగే గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చివరి నిమిషంలో..
నిజానికి తొలుత గ్లోబల్ ఎంట్రీతో పాటు డొమెస్టిక్ ప్రయాణికులకు వేగంగా సెక్యూరిటీ చెకింగ్ చేసే ‘టీఎస్‌ఏ ప్రి-చెక్’ (TSA PreCheck) సేవలను కూడా ఆపేయాలని ప్రభుత్వం భావించింది. 2024లో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఈ సేవలను వినియోగించుకున్న నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
సస్పెన్స్‌గానే..
ప్రస్తుతం కేవలం గ్లోబల్ ఎంట్రీని మాత్రమే నిలిపివేస్తున్నట్లు హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ట్రంప్ డిపోర్టేషన్ ప్రక్రియలో మార్పులు చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తుండటం, దీనిపై అధికార పక్షంతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సేవలు మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.


