India
oi-Lingareddy Gajjala
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2015-16 అంచనా సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను వ్యవహారంలో తనపై విధించిన రూ.1.5 కోట్ల జరిమానాను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసులో జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి తీర్పునిచ్చారు.
ఈ వివాదానికి నేపథ్యం 2015లో విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాలే. ఆ సమయంలో లభించిన పత్రాల ఆధారంగా, ‘పులి’ సినిమా ద్వారా విజయ్ సుమారు రూ.15 కోట్ల ఆదాయం పొందినప్పటికీ, ఆ మొత్తాన్ని ఆయన ఆదాయపు పన్ను రిటర్నుల్లో వెల్లడించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. దీనికి ప్రతిగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి తాను మొత్తం రూ.35.42 కోట్ల ఆదాయాన్ని ప్రకటించినట్లు విజయ్ పేర్కొన్నారు.
అయితే, సోదాల అనంతరం జరిపిన విచారణలో ఆదాయపు పన్ను శాఖ ఈ ఆదాయం పూర్తిగా వెల్లడించలేదన్న అభిప్రాయానికి వచ్చి, ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం 2022 జూన్ 30న రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ విజయ్ హైకోర్టును ఆశ్రయించారు.
జరిమానా ఉత్తర్వు..
విజయ్ తరఫు వాదనలో కీలక అంశం ఏమిటంటే-జరిమానా ఉత్తర్వు చట్టపరంగా నిర్ణయించిన గడువు లోపు జారీ కాలేదన్నది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, జరిమానా ఉత్తర్వు 2019 జూన్ 30 లోపు ఇవ్వాల్సి ఉండగా, మూడేళ్ల ఆలస్యంగా 2022లో ఇచ్చారని ఆయన వాదించారు. ఈ కారణంగా జరిమానా ఉత్తర్వు చెల్లదని కోర్టు ప్రకటించాలని కోరారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న సింగిల్ జడ్జి 2022 ఆగస్టు 16న జరిమానా వసూలుపై తాత్కాలిక స్టే ఇచ్చారు.
ఐటీ శాఖ స్పష్టం..
మరోవైపు, ఆదాయపు పన్ను శాఖ తమ వాదనలో చట్టంలోని సంబంధిత సెక్షన్లను ప్రస్తావించింది. కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలు, అప్పీల్స్ కొనసాగుతున్న సమయంలో జరిమానా విధించడానికి గడువు పొడిగింపు వర్తిస్తుందని, అందువల్ల 2022లో జారీ చేసిన ఉత్తర్వు పూర్తిగా చట్టబద్ధమేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. జరిమానా నోటీసు, తదనంతర చర్యలన్నీ ఆదాయపు పన్ను చట్ట పరిధిలోనే జరిగాయని వాదించింది.
బలమైన కారణాలు లేవు..
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ఆదాయపు పన్ను శాఖ వాదనలతో ఏకీభవించారు. జరిమానా ఉత్తర్వు చట్ట విరుద్ధమని చెప్పడానికి ఎలాంటి బలమైన కారణాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. గడువు అంశంపై విజయ్ చేసిన వాదనను తోసిపుచ్చుతూ, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం జరిమానా విధింపు చెల్లుబాటవుతుందని తీర్పు ఇచ్చింది. దీంతో విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
స్వేచ్ఛ ఉందని కోర్టు స్పష్టం..
అయితే, ఈ తీర్పుతో విజయ్‌కు అన్ని మార్గాలు మూసుకుపోలేదు. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ, గడువు అంశం కాకుండా ఇతర కారణాల ఆధారంగా ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)ను ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని కోర్టు స్పష్టం చేసింది. అంటే, జరిమానా అంశంపై న్యాయపోరాటం ఇంకా పూర్తిగా ముగిసినట్టుకాదు.
సినీ రంగంలో అగ్ర నటుడిగా, రాజకీయ రంగంలో కొత్త పార్టీ స్థాపకుడిగా ఉన్న విజయ్‌కు ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ ప్రవేశం తర్వాత ఆయన ఎదుర్కొంటున్న తొలి పెద్ద న్యాయపరమైన సవాళ్లలో ఇదొకటిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


