International
-Syed Ahmed
ఇరాన్(Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) ఉమ్మడిగా, ఏకపక్షంగా ప్రారంభించిన యుద్దం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్ధితి. ఓవైపు తాము ప్రారంభించిన యుద్దం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేక అవస్థలు పడుతున్న అమెరికా, మరోవైపు అమెరికా ఎంతకాలం సాయం చేస్తుందో తెలియక తమను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్న ఇజ్రాయెల్, ఇంకోవైపు తమను తక్కువ అంచనా వేసిన వీరిద్దరినీ డ్రోన్లతోనే ముప్పుతిప్పలు పెడుతున్న ఇరాన్. ఇలా సాగుతున్న ఈ యుద్ధంలో అంతిమ విజేత ఎవరో ఇంకా తెలియట్లేదు. అయితే రష్యా మాత్రం అతిపెద్ద లబ్దిదారుగా మారుతోంది.
ట్రంప్ ఇరాన్ యుద్ధం అనుహ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin)కు అతిపెద్ద లాభదాయకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యాంక్ నష్ట నివారణ చర్యలపై చర్చల్లో ఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పుతిన్‌కు ఒక పరిష్కారాన్ని అందించాయి. ఈ దాడులతో చమురు ధరలు ఆకాశాన్నంటి, క్రెమ్లిన్ ప్రధాన ఆదాయ వనరు అయిన చమురుకు ఊతమిచ్చాయి.
గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ తిరిగి వైట్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ అమెరికా.. రష్యా ఇంధన వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. మాస్కో యుద్ధ యంత్రానికి నిధులు అందకుండా చేసేందుకు, భారత్, చైనా వంటి తన విధేయులైన కస్టమర్లను మినహాయించే ప్రయత్నం చేసింది. భారత ఎగుమతులపై భారీ సుంకాలు, రష్యాలోని రెండు అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించింది. ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించే వరకు ఈ ప్రణాళిక బాగానే పనిచేస్తున్నట్లు కనిపించింది. అయితే ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడంతో పరిస్థితి మారిపోయింది. ఈ చర్య కీలక ఇంధన ఉత్పత్తి ప్రాంతమైన మధ్యప్రాచ్యం నుండి ఎగుమతులను అడ్డుకుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఈ ఘర్షణ రష్యాకు అనుకూలంగా మారింది.
2026 ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్‌లో తన ‘ప్రత్యేక సైనిక ఆపరేషన్’ను పరిమితం చేసుకోవడం లేదా తన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఆయనకున్న రెండు మార్గాలు. ఈ ఏడాది మాస్కో బడ్జెట్ అంచనాలు, దేశ ప్రధాన ఎగుమతి అయిన ఉరల్స్ క్రూడ్ బ్యారెల్‌కు $59గా ఉంది. అయినప్పటికీ, పాశ్చాత్య ఆంక్షలు, అధిక వడ్డీ రేట్లు, కార్మికుల కొరత వంటి కారణాల వల్ల జనవరిలో ఇంధన ఆదాయాలు 2020 తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయాయి. దీంతో పన్ను వసూళ్లు తగ్గిపోయి ఆర్ధికవ్యవస్థకు మరింత నష్టం కలిగించింది. ఇలాంటి సమయంలో ట్రంప్ మొదలుపెట్టిన వార్ తో చమురు విక్రయాలు పెరిగి రష్యా ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటోంది.
అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడుల ఫలితంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇది క్రెమ్లిన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా మారి, ఆర్థికంగా పెద్ద ఊతమిచ్చింది. ఈ వారాంతంలో ఇరాన్ చమురు క్షేత్రాలపై బాంబు దాడుల జరిగిన తర్వాత, బ్యారెల్ క్రూడ్ ధర 100 డాలర్లకు పైగా ఎగబాకింది. రష్యా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించిన 2022 వేసవిలో మార్కెట్లు పెరిగినప్పటి నుండి చూస్తే ఇదే అత్యధికం. దీంతో ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రష్యాకు ఈ వార్ వరంలా మారింది. ఇప్పటికే వదిలేసిన భారత్ కూడా మరో నెల రోజుల పాటు రష్యా వద్ద డిస్కౌంట్ లేకుండానే చమురు కొనబోతోంది.


