Andhra Pradesh
oi-Lingareddy Gajjala
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగింది. కొన్ని రోజులుగా కనిపించిన చలి ప్రభావం తగ్గుముఖం పట్టగా, పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో వేసవి ముందస్తు సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32°C నుంచి 36°C మధ్య నమోదవుతుండగా, రాయలసీమలో తేమ శాతం తగ్గిపోవడంతో వేడి గాలుల ప్రభావం కనిపిస్తోంది.
ఏజెన్సీలో Weather..
పగటిపూట ఎండలు మండుతున్నప్పటికీ, తెల్లవారుజామున ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు పొగమంచు నమోదవుతోంది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఉదయం వేళల్లో మసక వాతావరణం నెలకొనడంతో రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 30°C, కనిష్టం 22°Cగా నమోదైంది. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత 8.5°C వరకు పడిపోవడం గమనార్హం.
ఈ నెలలో రెండు అల్పపీడనాలు
ఇక బంగాళాఖాతంలో ఈ నెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. భూమధ్యరేఖ సమీప హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఆదివారం నాటికి ఒక అల్పపీడనం ఏర్పడవచ్చని India Meteorological Department వెల్లడించింది. అలాగే ఈ నెల 19వ తేదీ తర్వాత నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ వాతావరణ పరిణామాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చెదురుమదురు వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇదే సమయంలో రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


