YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

విలువలు, విశ్వసనీయత ప్రాతిపదికన తెలుగు నేల రాజకీయ దశ-దిశను మార్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసంద్రాన్ని తలపించాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కేవలం ఒక రాజకీయ నాయకుడి మాటలా కాకుండా, ఒక సైన్యాధిపతి తన సైన్యంలో పోరాట పటిమను రగిలించినట్లుగా సాగింది.

“నల్లకాలువలో ప్రజలకు ఇచ్చిన ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులనే కాదు, రాష్ట్ర చరిత్రనే మార్చేసింది” అని జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించి కార్యకర్తలలో ఉద్వేగాన్ని నింపారు. నాడు పార్టీ స్థాపించినప్పుడు అధికార బలంతో కాంగ్రెస్, కుతంత్రాలతో తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైలుకు పంపినా తను ఏనాడూ వెనక్కి తగ్గలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు జగన్ అనేవాడు ఒక్కడే అయినా, పైన ఉన్న దేవుడు, కింద ఉన్న తనను నమ్ముకున్న ప్రజలు తోడుగా ఉన్నారని, అందుకే ఆనాడు కేంద్ర అధికార సామ్రాజ్యాన్నే ఎదిరించి నిలబడగలిగానని ఆయన తన ధైర్యాన్ని చాటి చెప్పారు.

YSRCP జగన్ ఒక్కడిదే కాదు..

వైఎస్సార్‌సీపీ అంటే కేవలం జగన్ అనే ఒక వ్యక్తి సొత్తు కాదని, ఇది వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకున్న కోట్ల మంది అభిమానులదని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలదని జగన్ భావోద్వేగంతో ప్రకటించారు. తనను గుండెల్లో పెట్టుకుని భుజాలపై మోస్తున్న కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, కష్టకాలంలో కూడా వెనుకంజ వేయకుండా నిలబడుతున్న వారే తన సైన్యమని ఆయన కొనియాడారు. వైఎస్సార్‌సీపీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, అది ఒక లక్ష్యం కోసం లక్షలాది మంది చేసిన త్యాగాలకు, కష్టానికి నిలువెత్తు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

కార్యకర్త గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా..

పార్టీ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తూ.. తనతో నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు సమాజంలో గర్వంగా కాలర్ ఎగరేసుకుని, “అదుగో అతడే మా నాయకుడు, అదే మా వైఎస్సార్‌సీపీ” అని చెప్పుకునేలా పార్టీ అడుగులు పడుతాయని జగన్ హామీ ఇచ్చారు. విలువలు లేని రాజకీయాల మధ్య విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ఈ పార్టీ, ఎప్పటికీ తన సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వేడుకలో మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది అభిమానులు పాల్గొని జై జగన్ నినాదాలతో పార్టీ కార్యాలయాన్ని హోరెత్తించారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related